కేసీఆర్ గురించి కేటీఆర్‌ ఆ డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం అర్థమైంది!: విజయశాంతి

  • ‘సారు... కారు.. సర్కార్’ డైలాగ్ పై విమర్శలు
  • యాదగిరిగుట్టలో స్థూపాలపై కేసీఆర్ బొమ్మా!
  • కేసీఆర్‌ దొరతనాన్ని ప్రదర్శించడం తగదు
సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పదేపదే ‘సారు... కారు.. సర్కార్’ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైందని సెటైర్లు విసిరారు. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునికీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ బొమ్మను, కార్ గుర్తును, టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా, కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందని విమర్శించారు.

రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్‌ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి, వాటిని లైట్‌గా తీసుకునే ప్రమాదం ఉందని అన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని, అలాంటి, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ, ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే నానుడికి తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నానని విజయశాంతి తన ఎఫ్బీ పోస్ట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
Congress
Vijayashanti

More Telugu News